Tiruppavai (Dhanurmasa Vratham) తిరుప్పావై (ధనుర్మాస వ్రతం) – డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

 Tiruppavai (Dhanurmasa Vratham)

తిరుప్పావై (ధనుర్మాస వ్రతం)

– డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్


price ; 36/-


మనదే పాశురాస్త్రం
ఈ నెల 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం
 తల్లయినా… తండ్రయినా… గురువైనా… స్నేహితుడైనా… చివరకు భగవంతుడైనా సరే శరణాగతితోనే చేరువవుతారు. నీ ఆత్మను సంపూర్ణంగా అర్పించగలిగితే ప్రతి మనిషీ కన్నయ్యే, ప్రతి హృదయమూ మమతల కోవెలే. పాశురాలు ఇదే విషయాన్ని చెబుతాయి.
శ్రీకృష్ణా! నాకు తల్లి, తండ్రి, స్నేహితులు, బంధువులు.. ఒకటేమిటి? అన్నీ నువ్వే.
బంధుత్వాలన్నీ నీతోనే. ఈ ఒక్క జన్మలోనే కాదు… అన్ని జన్మల్లోనూ నీ చెలిమే కావాలి.
తనువు, మాట, మనసు… అన్నిట్లోనూ నువ్వే నిండిపోవాలి. నన్ను నేను మర్చిపోవాలి. చివరకు నీలో ఐక్యం చెందాలి. ఇంతకన్నా నాకు మరే కోరికా లేదు స్వామీ… అంటూ పరిపూర్ణమైన భక్తిని ప్రకటిస్తుంది గోదాదేవి తన తిరుప్పావై పాశురాల్లో.
దేవుడు ఎక్కడో పైలోకాల్లో ఉండడు. మన ఇంట్లోనే, మన చుట్టూనే, మనకు దగ్గరగానే ఉంటాడు. మనం పిలిస్తే పలుకుతాడు. మనకు ఆత్మబంధువుగా ఉంటాడు. మనం ఆత్మీయతతో పిలిస్తే తక్షణమే పలుకుతాడు. మనం చేయవలసిందల్లా మనసునీ, మాటనీ ఒకటిగా చేసి కన్నయ్యను పిలవటమే అంటూ పరమాత్మను చేరుకునేందుకు పారమార్థిక చింతనను అందిస్తాయి పాశురాలు.
* భగవంతుడిని చేరుకోవటానికి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే తొమ్మిదిమార్గాలు (వీటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు) ఉన్నాయని చెబుతుంది భాగవతం. తిరుప్పావై పాశురాల్లో కీర్తనం, స్మరణం, ఆత్మనివేదన స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా కీర్తన మార్గం విశిష్ఠత స్పష్టమవుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మిగిలిన భక్తి మార్గాలు వాటిని అనుసరించిన భక్తుడిని మాత్రమే తరింపజేస్తే, కీర్తన మార్గం ఇందుకు భిన్నంగా భగవంతుడిని కీర్తించిన భక్తుడితో పాటు వాటిని విన్న, గానం చేసిన భక్తులందరినీ తరింపజేస్తుంది. తిరుప్పావై సరిగ్గా ఇదే మార్గంలో సాగి, పాశురాల్ని గానం చేసిన ప్రతి ఒక్కరినీ పరమాత్మకు ప్రియమైన భక్తులను చేస్తుంది.
మార్గళి నోము   

భక్తి ఎంతో మధురం. జైమిని రాసిన అశ్వమేధ పర్వ గ్రంథం- భగవంతుడిపై అనురాగం, ప్రపత్తి విశుద్ధ భక్తితత్వానికి పరాకాష్ఠ అంటుంది. ఈ రెండూ ఎందరినో మధురభక్తి వైపు మరలిస్తోంది. మధుర భక్తిని ప్రాచీన ఆలంకారికులు భావంగానే పరిగణించినా, వైష్ణవాలంకారికులు దీన్ని రసంగానూ నిరూపించారు. ఆళ్వార్లు మధురభక్తిని గోపికా భక్తి, రసమయ భక్తి అన్నారు. మోక్ష శృంగారం, భక్తి శృంగారం అనే రెండు తత్వాలను వివరిస్తూ రూప గోస్వామి- శ్రీకృష్ణుడితో భావ శృంగారం నెరపవచ్చునంటాడు. భగవంతుడితో భక్తి, ప్రణయానికి సైతం దారితీసింది. ఇలాంటి మధుర భక్తిలో ప్రధానమైంది పతీ పత్నీ భావం. భగవంతుడితో శృంగార భావం కనుక దీన్ని దివ్య ప్రేమ అంటారు. ఈ దివ్యప్రేమలో విషయ లోలత ఉండదు. కామవాసనల ప్రసక్తి రాదు. ఆండాళ్‌, వటపత్రశాయిపైని మధుర భక్తిలో భగవంతుడిపై అపారమైన అనురాగం వ్యక్తమై పతీ పత్నీ భావనతో ఏకాంత నిష్ఠతో జీవాత్మ పరమాత్మల సంలీనం జరిగింది. ఈ ప్రేమకు ప్రాతిపదికే ఆండాళ్‌ తల్లి రాసిన తిరుప్పావై.

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో, శ్రీరంగంలోని రంగనాథుడి సేవకు జీవితాన్నే అంకితం చేసిన విష్ణుచిత్తుల దంపతులకు తులసివనంలో శిశువుగా గోదాదేవి లభించిందన్నది ఐతిహ్యం. నలనామ సంవత్సరం, కర్కాట మాసం, పుబ్బా నక్షత్రం, ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజు (క్రీ.శ. 776)న ఆ శిశువు లభించింది. తిరువెంగళాచార్యులు అనే గొప్ప జోస్యుడు ఆ పసిబిడ్డను పరిశీలించి ఆమెది లక్ష్మీదేవి అంశ అని చెప్పాడంటారు. ఆమెను కోదై, చూడిక్కొడుత్త నాచ్చియార్‌, ఆండాళ్‌ అని పిలుచుకొనేవారు. విష్ణుచిత్తుడు ఆండాళ్‌కు శ్రీ వైష్ణవంలోని ప్రేమతత్వ జ్ఞానాన్ని బోధించాడు. మాధవుడు గోపికలకు ఆనందం కలిగించేవాడు మాత్రమే కాదు, ఆయన సర్వప్రాణులకు అంతర్యామి అంటూ తండ్రి చెప్పిన మాటలు ఆండాళ్‌కు భక్తిరస గుళికలయ్యాయి. దీనితో ఆమె బుద్ధి జ్ఞానవిలసితమైంది. తనను తాను మాధవుడికి చెందినదిగా భావించింది. ఈ భావనలతోనే ఎదిగి పదిహేను సంవత్సరాలకే యుక్త వయస్సులో శ్రీలక్ష్మీ కళతో అందచందాలను సంతరించుకొంది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకొని వెళ్ళేవారు. వాటిని గోదాదేవి ముందే ధరించి తరవాత స్వామివారికి పంపించసాగింది.ఓ రోజు ఈ రహస్యం తండ్రికి తెలిసి చాలా దుఃఖించారు. రెండు రోజులు స్వామివారికి మాలాధారణ కావించరు. దానితో వటపత్రశాయి మొహం చిన్నబోతుంది. దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తుడికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఇక ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తాడు.

వైష్ణవ సంప్రదాయానికి ఆది పురుషులైన పన్నిద్దరు ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు, ఆండాళ్‌ విశిష్టమైనవాళ్లు. వీళ్లది తండ్రీ కూతురి సంబంధం. వీళ్లను అందుకే నిత్యసూరులని పిలుస్తారు. ఆండాళ్‌ తల్లిది విశిష్టాద్వైత సిద్ధాంతం. ఈమె పన్నెండుమంది ఆళ్వారుల్లో ఏకైక స్త్రీరత్నం. ధనుర్మాసంలో తాను చేపట్టిన వ్రతంతో ఆండాళమ్మ తన చెలికత్తెలను సూర్యోదయానికి పూర్వమే నిద్రలేపి తటాకంలో స్నానాదికాలు ముగించుకొని తిరుప్పావై పాడి వటపత్రశాయిని మేల్కొల్పేదట. ధనుర్మాసం మార్గశీర్ష పుష్యమాసాల మధ్య సంభవించే కాలం.

తనను తాను గోపకన్నెగా భావించుకొని సఖులతో కూడి శ్రీకృష్ణుడితో నిత్యసాన్నిహిత్యాన్ని కోరి ఆచరించిన వ్రతమే మార్గళి వ్రతం. తిరుప్పావైలోని పాశురాలు వేదాలన్నింటికీ బీజాల వంటివి. ఈ దివ్య మధుర గీతాలు రసబంధురాలు.

ధనుర్మాసంలో క్రమం తప్పకుండా తిరుప్పావై పాశురాలు తిరుమలలో గానం చేస్తూ ఉంటారు. ఆ నెలరోజులూ సుప్రభాత సేవ ఉండదు. దేశవ్యాప్తంగా ఉషోదయవేళ అన్ని వైష్ణవ ఆలయాల్లో వినిపించే ఈ తిరుప్పావై పాశురాలు అక్కడి వాతావరణంలో అలౌకిక భావనలకు గురిచేసి భక్తుల హృదయాలను మనోహరపరుస్తాయి.

– అప్పరుసు రమాకాంతరావు



Thiruppavai Lyrics In English
Thiruppavai Pasuram 1 Meaning
Thiruppavai Pasuram 1 To 30 In Tamil Lyrics
Thiruppavai Pasuram English
Thiruppavai Pasuram Telugu
Thiruppavai Pasuram With Meaning
Thiruppavai 30 Pasuram
Thiruppavai Pasuram 2 In English

Post a Comment

Previous Post Next Post