Chitikalo Chikitsa
చిటికలో చికిత్స
-dr. G.v.purnachandu
price;300/-
కొన్ని ఐడియాలు జీవితాన్ని మార్చేస్తుంటాయి. ఈ అనంత విశ్వంలో గ్రహాలు, గ్రహశకలాలు ఎన్ని ఉన్నాయో, ఈ భూమండలం పైన గాలిలో రేణువులు, పరమాణువుల ఎన్ని ఉన్నాయో ఐడియాలు అన్ని ఉన్నాయి. ఒక కొత్త ఆలోచనకు మనం ప్రవర్తించగలిగినప్పుడు నిజంగానే తగ్గట్టుగా చిటికలో మహత్తులు కన్పిస్తాయి. ‘దానం’ చేయాలనే ఆలోచన రావటం మంచిదే! కాని, దానం చేసినప్పుడు కదా… ఆ ఆలోచన ఫలించేది! ‘చిటికలో చికిత్స’ పుస్తకం ఇలాంటి వందలాది ఆలోచనలను అందిస్తోంది. వాటిని ఉపయోగంలో పెట్టినప్పుడు ఫలితం కనిపిస్తుంది.
షుగరు వ్యాధిలో పులుపొక్కటి తగ్గించేస్తే, ఉప్పు, కారం, నూనె, తీపి ఇలాంటివి తగ్గించి తినడనికి అవకాశం ఏర్పడుతుందన్నది ఒక ఆలోచన. ఉప్పు – కారాల బెడదని తగ్గించుకోవాలంటే, వేపుడు కూరలను మానేయడం ఒక ఆలోచన! బీపీ బారిన పడకుండా ఉండలంటే, ముఖానికి చిరునవ్వు తెచ్చి అంటించుకోవటం ఒక ఆలోచన. రోగం వచ్చినప్పుడు ”ఏం తినమంటారు?” అని అడగటం పాత ప్రశ్న. ఏది తినటం మానేయాలని అడగటం ఒక ఆలోచన!! తినే వాటివలనే గాని, తినని వాటి వలన రోగాలు రావు కదా! అందుకని, మానటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. తినవలసినవి మాత్రమే తినటం చికిత్స!
ఆసుప్రతి గుమ్మం ఎక్కింది లగాయితూ మనకొచ్చే ప్రతి బాధకీ వైద్యుణ్ణి, మందుల్నీ బాధ్యుల్ని చేసి, డాక్టర్లను చీటికిమాటికి మార్చటం పాత ఆలోచన. వ్యాధి వచ్చిన తరువాత మనం ఎంత మారామని ప్రశించుకోవటం, మారాల్సింది మనమేనని గుర్తించటం ఒక ఆలోచన. పచ్చిమిరపబజ్జీల బండి మీద దండయాత్ర ఆపితే కదా – వైద్యుడు కడుపులో మంటని తగ్గించగలుగుతాడు!!
కొత్తగా ఆలోచించి, అందుకు అనుగుణంగా ప్రవర్తించటం వలన వ్యాధులకు శాశ్వత పరిష్కారాలు దొరుకుతాయి. కుడిచేత్తో రకరకాల ఆహారపదార్ధాలని, ఎడంచేత్తో రకరకాల మందుల్ని తిని, కడుపును మందుల షాపు చేసుకున్నందున వలన రోగాన్ని శాశ్వత అనుచరుడిగా మార్చుకోవటం అవుతుంది!
వ్యాధి వచ్చినప్పుడు ఏ మందులివ్వాలో వైద్యుడికి వదిలేయండి. అది ఆయన సబ్జెక్టు. వ్యాధి వచ్చినప్పుడు మనం చేయకూడనివి, చేయవలసినవి తెలుసుకొని ఆ మేరకు జాగ్రత్తగా వుండటం రోగి సబ్జెక్టు.
శాశ్వత రోగ నిర్మూలన వైపు అడుగులు సాగేలా ఈ పుస్తకం మనల్ని నడిపిస్తుంది! చేయవలసింది చేయగలిగితే చిటికలో చికిత్స” సాధ్యమే అవుతుంది!! ”అందరికీ ఆరోగ్యం” అనేది ఈ పుస్తకం ఆశిస్తున్న ప్రయోజనం. ఇది ఆయుర్వేదం చెప్పిన ఆరోగ్యగీత! – డా॥ జి.వి. పూర్ణచందు
Post a Comment